Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

బ్రహ్మచర్య వ్రతము

తల్లిదండ్రుల కేవైనా పాపదోషాలుంటే అవి వారి సంతానానికిన్నీ సంక్రమిస్తవి. అందుచేగర్భవాసదోషాలుజీవునికి అంటకుండా ఉండేటట్లు సంస్కారాలుచేయవలసిఉన్నది. ఈ దోషాలు గార్భికమనీ, పైతృకమనీ రెండురకాలు. గార్భికాలు తల్లివల్ల కల్గేవి. ఈదోష నివారణ కోసమే ఉపనయనమువరకూ సంస్కారాలు ఎర్పడి ఉన్నవి. తనకున్న సంస్కారాలు తాను చేసుకోలేడు కాబట్టి, వానిని చేయవలసినవారు తలిదండ్రులు.

నయన మనగా తీసికొనిపోవడం. 'నయతీతి నయనమ్‌' కంటికి నయనమని పేరు. నాయకుడు లేదా లీడర్‌ మనలను ముందుకు తీసికొనిపోతాడన్నమాట, ఉప్ససమీపమునకు, నయనమ్సుతీసుకొనివెళ్లుట, ఉపనయనం. ఉపనయనం దేని సమీపానికి మనలను తీసుకొనివెళ్లుతూంది? గురుసమీపానకు, గురువెవరు? వేదవేత్త; మొదటి ఆశ్రయానికి ఒక గురువు. కడపటిఆశ్రమపు గురువు. విద్యనేర్చుట మొదటి ఆశ్రమంలో జ్ఞానంపొందుట కడపటి ఆశ్రమంలో.

ఉపనయనం బ్రహ్మచర్యానికి ఆరంభం. అదిసమావర్తనంతో ముగుస్తుంది. ఉపనయనమాది సమావర్తన పర్యంతం ఉండేది బ్రహ్మచర్యం. సమావర్తన మనగా తిరిగి రావడం. అనగా బయలుదేరినచోటికి తిరిగిరావడం. అధ్యయనం పూర్తిచేసి ఇంటికి తిరిగి రావడమే సమావర్తనం. సమావర్తనశబ్దం నుండి మనంగ్రహించేది ఉపనయనమాది అతడుఇంట్లోలేడనిన్నీ గురుసాన్నిధ్యంలో ఉన్నాడనిన్నీ, ఉపనయనం పూర్వాంగం. అంగమని ఒకటివుంటే అంగి అనగా ప్రధానమైనది వేరొకటి ఉండాలి. ప్రథానానికి అంగి అని పేరు. అది బ్రహ్మచర్యం.

బ్రహ్మ పదానికి ఆరు అర్థాలు. అవి వేదం, విష్ణువు, పరమశివుడు, బ్రాహ్మణజాతి, తపస్సు, పరమాత్మ స్వరూపం. 'బ్రహ్మ' అని దీర్ఘమిస్తే చతుర్ముఖునకు పేరు. బ్రహ్మచర్యంలోని బ్రహ్మశబ్దానికి వేదమని అర్థం. వేదం స్వాధీనం చేసుకోడానికి ఏర్పడిన ఆశ్రమమే బ్రహ్మచర్యం. దాని పూర్వాంగం ఉపనయనం. బ్రహ్మచర్యానికి నిర్ణయింపబడిన కాలం కనీసం పన్నెండుఏళ్ళు, ఒక వేదం సాంగోపాంగంగగా అధ్యయనం చేయాలంటే పన్నెండేళ్లు పడుతుంది.

బ్రహ్మచర్యం వేదాయనానికి ఏర్పడిన దీక్ష. దానికి పూర్వాంగం ఉపనయనం. పరిషేచనచేస్తున్నామే ఏమిటిదాని ఉద్దేశం? అది భోజనానికి అంగం. ఉపనయనం చేసికొని వేదాధ్యయనం చేయక వదలిపెట్టడం, పరిషేచనంచేసి భోజనంచేయకుండా ఉండడంవంటిది. ఉపనయనం అనే పూర్వాంగానికిన్నీ, సమావర్తనమనే ఉత్తరాంగానికిన్నీ మధ్య నాలుగు వ్రతాలున్నవి. అవి ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం.

వేదములు మంత్రసమూహం. లోకంలోఎన్నోమంత్రాలున్నవి. రామమంత్రం, నరసింహ మంత్రం, పంచాక్షరీ, తేలు మంత్రం, పాముమంత్రం, దృష్టిమంత్రం అభిచారమంత్రం, జాలవిద్య, ఇట్లు ఎన్నో మంచివీ, చెడ్డవీ మంత్రాలున్నవి. ఏమంత్రమైనా ఉపాసనచేసి సిద్ధి పొందవలెనంటే దానికై ఆయాదినాలలో ఆయా సమయాలలో ధూపాదు లివ్వాలనే నియమాలు కొన్ని మంత్రాలకున్నవి. ప్రతిమంత్రానికీ నియమం ఉన్నది. ఆ నియమం పాలిస్తేనే మంత్రానికి ప్రమోజనం, వేదాలు మంత్రసమూహాలు కనుక, వేదాధ్యయనానికిన్నీ కొన్ని నియమా లేర్పడిఉన్నవి, ఆ నియమాలు పాలించినపుడే దాని ప్రమోజనం సిద్ధిస్తుంది. పుట్టి పెరిగి పెండ్లిచేసికొని పిల్లలను కంటారు. పిదప తమ పిల్లలను పెంచి పెద్దవాళ్ళను చేస్తారు. అటుపిదప కడతేరేదారి వారికి చూపాలి. తామున్నూ కడతేరాలి. ఇందుకు మంత్రపూర్వకంగా కర్మ అనుష్టించాలి. ఆ కర్మకు ఏ మంత్రాలతో ప్రయోజనమో అట్టి మంత్రాలే వేదాలు. ఆ వేదాలలో ఒకశాఖను అధ్యయనం చేసినవాడే శ్రోత్రియుడు.

ఏ మంత్రం సిద్ధించాలన్నా నియమం అవసరం. ఆత్మకడతేరడానికి వేదం ఉన్నది. దానిని అధ్యయనం చేయడానికి ఏర్పడిన నియమమే బ్రహ్మచర్యం. వేదాలునాలుగుగా విభజింపబడినవి. అందులో ఒక్కొక్కదానిని ఒక్కొక్క ఋషి ప్రవర్తింపజేశాడు. వారి నుద్దేశించియే బ్రహ్మయజ్ఞ మేర్పడ్డది. బ్రహ్మయజ్ఞమంటే వేదయజ్ఞమని అర్థం. ఒక్కొక్క కాండకు ఒక్కొక్కవ్రతముంది. అన్ని కాండలకూ అధ్యయనం చేయడానికి వ్రతాలంటూ ఉన్నవి. ప్రాజాపత్యం తరువాత సౌమ్యవ్రతం, ఆగ్నేయవ్రతం, వైశ్వదేవవ్రతం, నాలుగుకాండలు పూర్తికాగానే గుర్వాజ్ఞపై సమావర్తనం చేయాలి.

పై చెప్పిన నాలుగువ్రతాలూ కృష్ణయజుర్వేదానికి, ఋగ్వేదానికి గోదానవ్రతం. ఉపనిషద్‌ వ్రతం ఇత్యాదిగా నాలుగున్నవి. గోదానమంటే గోవు రోమాలను క్షౌరం చేయడం. ఇట్లు ఒక్కొక్క వేదానికి ప్రత్యేకమైన వ్రతం ఉన్నది. సమావర్తనానికి స్నానమని ఒకపేరు. దానిని చేసినవాడు స్నాతకుడు. అందరూ ఒకవేదమునూ, విద్యలనూ అధ్యయనం చేయాలి. శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ చేస్తాము. నాడు వేదాధ్యయనం ప్రారంభించి పూష్యమాసంవరకూ ఆరుమాసాలు అధ్యయనం చేయాలి. మిగతా ఆరుమాసాలలో అంగములను చదువుకోవాలి ఒక్కొక్కనెలలో శుక్లపక్షములో వేదమునూ, కృష్ణపక్షములో అంగమునూ అధ్యయనం చేయాలి.

ఉపనయనమంటే 'గురో రుపనయనమ్‌' అనగా 'ఉపాధ్యాయనితో చేర్చుట' అనిఅర్థం ''బ్రహ్మచార్యసి, ఆచార్యాధీనో భవ, భిక్షాచర్యం చర'' అన్న ఆదేశానికి 'బాఢం' అని బదులుచెపుతాడు; అనగా తాము చెప్పినట్లే చేస్తానని దానికి అర్థం.

ఈకాలంలో అన్నానికి కరవైపోయింది. ఉపాధ్యాయులకు వేతనాలివ్వాలి. ఆకాలపు గురువులు ఇంటిలోనే వుండేవారు. అప్లికేషనులు ఎక్కడికీ పెట్టుకొనేవారుకారు. శిష్యులు భిక్షాటనంచేసి, భిక్షాన్నంలో సగం గురువుకిచ్చేవారుసి. అన్నముంటేచాలు, పాలుపోసికొనితినేవారు. బ్రహ్మచర్యం ముగిసే వరకూ అలవణంగా (ఉప్పులేకుండా) ఉండేది. తెచ్చిన అన్నం గురువుకర్పించి, వారిఅజ్ఞపై సగభాగం తీసుకొనేవారు. శిష్యులీవిధంగా గురువుగారిఅవసరాలు గుర్తించినపుడు గురువుకేమి కష్టం. ఉపాధ్యాయులు వేతనాలు తీసుకోరాదు.

ఇప్పటివలె ఇల్లుకాక, అన్నానికి గురు వాధారంకావడం వల్ల శిష్యులకు భయభక్తులుండేవి. వారు తప్పులు చేసేవారుకారు. బ్రహ్మచారి సమావర్తనం చేసేటప్పుడు గురుదక్షిణ ఈయాలి. జీవనానికే ఆచార్యుడు ఆధారమవడంచేత శిష్యునికి విద్య శీఘ్రంగా వచ్చేది. భక్తికారణంచేత విద్య చక్కగా అంటుపడేది, సమావర్తనకాలంలో గురువుదేనినైనా దక్షిణగా అడగవచ్చు, మహాభారతంలో గురువు నాగరత్నమును కోరినట్లొక కథ వున్నది. గురువు కోరినదానిని ఆయన కిచ్చిన తర్వాతనే శిష్యుడు పెండ్లి చేసుకోవాలి, తనవద్ద లేనిచో యాచనచేసి గురువు కోరినదానిని సంపాదించాలి. గురువుకోసం యాచించే శిష్యునికి ఎవరుబడితేవారు కోరినిదాని నిచ్చేవారు.

దక్షిణగావచ్చిన ద్రవ్యంలో గురువుకు కొంతమిగిలేది. దానితో ఆయన ఐశ్వర్యవంతుడైతే కావచ్చు. అందుచే గురువులకు దారిద్ర్యంలేదు. భోజనమున్నూ గడిచిపోయేది. బ్రాహ్మణులకోసమని కరకులు పంటకోతలలో ఒకభాగం పొలములో పడవేసి వుంచేవారు. ఆధాన్యం ఎత్తుకొనిపోవడమే ఉంఛవృత్తి. ఏబదిఏళ్ళక్రితంకూడా ఈవాడుక ఉండేది. ఈ కాలములో చెంబుతీసుకొని బియ్యం ముష్టిఎత్తుకోడం ఉంఛవృత్తి అని అనుకొంటున్నారు. 'ఉంఛ' శబ్దానికి ఏరుకొనుట అని అర్థం. ఉంఛవృత్తి అనగా పొలాలలో వదలిన ధాన్యం ఏరుకోడం.

ఆకాలంలో క్షత్రియులున్నూ, వైశ్యులున్నూ వేదాధ్యయనం చేసేవారు. వారు ఇచ్చిన దక్షిణతో గురువు ధనికుడయ్యేవాడు. అందరూ గురువులైతే బిచ్చం ఎవరిని అడగడం? దానాలు గ్రహించి ధనికులైన బ్రాహ్మణులుండేవారు. వారి వద్దనూ భిక్షమడిగేవారు. సమావర్తనకాలంలో క్షత్రియులూ వైశ్యులూ గురుదక్షిణ విస్తారంగా ఇచ్చేవారు.

''ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య,

ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీః||''

'ఆచార్యునికి ప్రియమైనధనం ఇచ్చి పిదప పెళ్లిచేసుకో ప్రజాతంతువు వేదరక్షణకై ఏర్పడినది. దానినిత్రెంపవద్దు'అని తైత్తిరీయోపనిషత్తు చెపుతూంది. గురుసమీపంలో ఉండడమే ఉపనయనం. చక్రవర్తికుమారుడైనా భిక్షాన్నంతింటూ ఆచార్యునివద్ద ఉండవలసినదే.

బ్రహ్మచారి ప్రతిరోజూ అగ్నికార్యం అనగా సమిధాధానం చేయాలి. భిక్షాచర్యం చేయాలి. అలవణంగా భుజించాలి. బ్రాహ్మణుడు పలాశదండం ఉంచుకోవాలి. క్షత్రియుడు అశ్వత్థదండాన్ని, వైశ్యుడుఅత్తిదండాన్ని ఉంచుకోవాలి. శ్రుతధారణకోసం దండం. దేని నధ్యయనం చేస్తున్నాడో దానిని ధారణచేసే నిమిత్తం దండంకావాలి. వేదమంత్రశక్తిని ధారణచేసే శక్తి ఆ దండాని కున్నది. బ్రహ్మచారికి కృష్ణాజినమే ఉత్తరీయం, వస్త్రంవాడరాదు. వేదాధ్యయనం భాద్రపదంలో ప్రారంభించి మాఘమాసంలో ఉత్సర్జనంచేసినాక అంగాధ్యయనం చేయాలి. దానిని చేయనందులకు 'కామో కారీత్‌' మంత్రం జపిస్తున్నాము.

'నేను పాపంచేయడంలేదు. నా కోపమో, కామమో చేస్తున్నది. అది నన్నంటదు' అని ఈమంత్రానికి అర్థం. ఉత్సర్జనం చేసినట్లైతే ఈ మంత్రం అవసరం లేదు.

ఇట్లా కాలనియమం, వ్రతనియమం, ఆహారనియమం మొదలయినవిఅనుష్ఠించడమే బ్రహ్మచర్యం. వేదాధ్యయనంలో స్వరలోపం, వర్ణలోపం మొదలైనలోపాలు ఏర్పడుతై. శ్రావణపూర్ణిమనాడు తిలలుమాతరం భుజించి, ఆనాడంతా ఉపవాసముండి మరునాడు 1008 సమిధలతో హోమం చేయాలి. ఈ హోమం స్వర వర్ణ లోపాలనిమిత్తం చేసేది. కాని ఈ హోమం ఇప్పుడు తొలిశ్రావణమువారు మాత్రంచేస్తున్నారు. అందరున్నూశ్రావణపూర్ణిమ మరుసటిరోజు చేయాలి. సమిధలతో హోమంచేయడం ఉత్తమం. వట్టి జపంమాత్రం చేస్తే నిద్రరావచ్చు. అందుచేత లోపమేర్పడుతుంది. ఏదయినా పని ఉంటే నిద్రరాదు. అందుకోసమైనా సమిధాహోమం చేయాలి. పలాశసమిధలు వాడాలి. అవిదొరకనప్పుడు అశ్వత్థసమిధలూ, అవి లేనిచో కనీసం దర్భలతోనైనా హోమం చేయాలి. 'మిధ్యాతీత ప్రాయశ్చిత్తార్థం' అంటూ సంకల్పం చేయాలి.

బ్రహ్మచారికి ఆహారపరిణామంలో ఒక నియతి లేదు. అతడు కడుపార భుజింపవచ్చును. రుచికరములైన పదార్థాలను మాత్రం తగ్గించాలి. ఉపవాసాలు కూడదు. పన్నెండేళ్ళు గురుకులవాసం చేసి ఒక వేదమునూ, ఇతర విద్యలనూ నేర్చుకొన్న బ్రహ్మచారి గురుసాన్నిధ్యంలోనే ఉండవచ్చు. జీవితాంతమూ గురుసాన్నిధ్యంలోనే గడపవచ్చు. అతనికి తన జీవితాన్నే అర్పించవచ్చు. దానిని నైష్ఠిక బ్రహ్మచర్యమని అంటున్నారు. కాని కలియుగంలో అది ప్రశస్తమని చెప్పబడలేదు.

బ్రాహ్మణునకు ఉపనయనం గర్భాష్టమాలలోజరపాలి. అనగా ఏడోఏటిలో చేయవలెను ఐదేళ్లప్పుడుచేసేది కామ్యోపనయనమని అనబడుతున్నది. విశేషఅభివృద్ధిని కోరేవారు అది చేయవచ్చు. ఐదవఏట చేయకపోయినా దోషంలేదు. ఉపనయనానికి ముందే సంస్కృతాక్షర జ్ఞానమూ, భాషాజ్ఞానమూ ఉండాలి.

సమావర్తనం చేసుకొని అవివాహితుడుగా ఉండేవాడు స్నాతకుడు. కాశీయాత్ర చేసేవా డితడే. ఇట్లు ఉపనయనం మొదలుకొని స్నాతకపర్యంతమూ భిక్షాచరణచేస్తూ, వ్రతానుష్ఠానమూలంగా బుద్ధికి చురుకుదనం సాధించి వేదాధ్యయనం చేస్తూ పూజా, స్నాన, ఔపాసనాదికాలు తెలిసికొనడమే బ్రహ్మచర్యం.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page